Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ నియోజవర్గంలో నేను 50 వేల మెజార్టీతో గెలుస్తా.. ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేశారు.. దాంతో, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో.. ఆయన భార్యను బరిలోకి దింపినా.. విజయం సాధించలేకపోయారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో మరోసారి హుజూర్‌నగర్ నుంచి పోటీచేసే యోచనలో ఉత్తమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్ పర్యటన నేపథ్యంలో.. ఉత్తమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
హుజూర్‌నగర్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. నా హయాంలో 80 శాతం పూర్తయిన పనులను.. 8 సంవత్సరాల పాటు సాగదీసి ఇప్పుడు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారంటూ ఫైర్ అయ్యారు.. డబుల్ బెడ్ రూమ్‌లను వేగంగా పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు వాటిని కేటాయించాలని డిమాండ్ చేశారు.. మున్సిపల్ భూములకు సంబంధించిన భూముల రికార్డులు మున్సిపాలిటీలో మాయం అవుతున్నాయని కేటీఆర్‌కు ఫిర్యాదు చేశా.. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.. మున్సిపల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్ చోరి చేసి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ కేటాయించిన విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని.. భూకబ్జాదారులను కాపాడటానికి మాత్రమే ఆర్డీవో కార్యాలయం ఉపయోగపడుతుందని ఆరోపించారు. నా హయాంలో కట్టించిన ఇరిగేషన్ లిఫ్ట్‌ల మరమ్మతులు కూడా చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కాగా, రానున్న ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీచేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధం అవుతున్నట్టు ఈ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది.