2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు కొస్తున్నా వేతనాలు, బకాయిలు విడుదల కాకపోవడం పట్ల యుఎస్పీసీ ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ బుధవారం డిటిఓ ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని యుయస్పీసీ తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సత్వర మంజూరు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఉపాధ్యాయులు, పెన్షనర్ల సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, జిపిఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్,పీఆర్సీ, డిఎ బకాయిలు తదితర వేలాది బిల్లులు ననెలల తరబడి ప్రభుత్వ ఆమోదం కోసం ఇ కుబీర్ లో పెండింగ్ లో ఉంటున్నాయి.
సంఘాల ద్వారా ప్రాతినిధ్యం చేస్తే కొన్ని బిల్లులు మంజూరు చేస్తున్నారు. గత మూడు వారాలుగా అవి కూడా నిలిపివేశారు. జిఓ 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయుల జనవరి నెల సప్లిమెంటరీ వేతనాలు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుండి ఉన్న బిల్లులను మార్చి 31వరకూ మంజూరు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిందని తిరస్కరించారు.
ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి సమీక్షించిన యుయస్పీసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ముందుగానే మెమోరాండమ్ సమర్పించింది. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని కోరుతూ బుధవారం (మార్చి 23) మధ్యాహ్నం 3.30 కు జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో పాల్గొనాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.