తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ నిజాంను తరిమి కొట్టాలని, కూకటి వేళ్ళ నుంచి టీఆర్‌ఎస్‌ను పెకిలించడమం కోసమే బండి సంజయ్ యాత్ర అని ఆయన వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, దాశరథికి నా నివాళులని, భగభగ మండే నడి ఎండలో 31 రోజులు 400 పైగా కిలోమీటర్ల దూరం బండి సంజయ్ నడిచారని ఆయన గుర్తు చేశారు. చంద్రశేఖర్ రావు నీళ్లు, నిధులు, నియమకాల పేరిట రాష్ట్రం సాధించారు.. ఆ కల సాకారమైందా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ కలను మేము సాకారం చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాం.. ఇది చెప్పడానికి, గుర్తు చేయడానికి నేను తెలంగాణ కు వచ్చా అని అమిత్ షా తెలిపారు.
కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయం వెళ్ళలేదు.. ఆయనకు ఏ తాంత్రికుడు చెప్పాడో.. వెళ్లకూడదని అంటూ మండిపడ్డారు. రైతుల రుణమాఫీ అవ్వలేదు.. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తా అన్నారు.. నిర్మించలేదు డబుల్ ఇండ్లు అన్నారు.. ఇవ్వలేదు.. కనీసం ప్రధాని అవాస యోజన కూడా అమలు చేయలేదు.. అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా దళితులకు 3 ఎకరాలు అన్నారు.. 3 అంగుళాల భూమి కూడా ఇవ్వలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నీ కొడుకు బిడ్డకు అధికారం ఇచ్చావు.. కానీ సర్పంచ్ లకు అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.