పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఉంటుందన్నారు. ఇక, సెప్టెంబర్ మాసం మొత్తంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని సూచించిన కేటీఆర్.. గ్రేటర్ హైరాబాద్‌లోని 150 డివిజన్లలో కమిటీలు, స్లమ్స్ లో బస్తీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.. ఏ కమిటీ అయినా చెల్లుబాటు కావాలంటే 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలలు ఉండాలని స్పష్టం చేశారు.
మరోవైపు.. సోషల్ మీడియాకు ప్రత్యేకంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు కేటీఆర్… ఢిల్లీలో కూడా జెండా పాతే స్థాయికి టీఆర్ఎస్ చేరుకోవడం మాములు విషయం కాదన్న ఆయన.. సెప్టెంబర్ 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. ఢిల్లీలో పార్టీ కార్యాలయం అద్భుతంగా ఉండబోతోందన్నారు. ఇక, కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసే వారిని తీసుకుంటామని.. అనుబంధ సంఘాలను కూడా ఈ సారి పటిష్టంగా వేసుకుంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.