తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్‌లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు తాను రెడీ అని కేసీఆర్ ప్రకటించి ఇప్పటికే చాలా కాలమైంది. ఇప్పుడా ప్రకటకకు తగ్గట్టుగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ భేటీలోనే బీఆర్‌ఎస్ గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయాలని కమలనాథులు ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. నా పుట్టలో చేయి పెడితే కుట్టకుండా ఊరుకుంటానా అన్నట్టుగా.. కేసీఆర్ ఇప్పుడు హస్తినపై గులాబీ జెండా రెపరెపలాడాలని ఊవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చేనెలలో జరగనున్నాయి. ఈలోపే జాతీయ పార్టీని ప్రకటించి కమలంపై యుద్ధభేరి మోగించాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
అసలు సీఎం కేసీఆర్ కూటమి కాకుండా కొత్త పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? కొత్త పార్టీ అనౌన్స్ తర్వాత రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉంటుందా? కొత్త జాతీయ పార్టీని దేశప్రజలు ఎంత మేర ఆదరిస్తారు? హిందీ బెల్ట్‌ను ఆకట్టుకోవడానికి KCR వద్ద ఉన్న అస్త్రాలేంటి? జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే.. మరి టీఆర్‌ఎస్‌ను ఏం చేయబోతున్నారు? కొత్త జాతీయ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తారా? లేక రెండు పార్టీలను విడివిడిగా చూస్తారా? అనేది ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రస్తుతం బలంగా ఉన్న BJPని ఢీకొట్టడానికి కారు పార్టీ దగ్గరున్న శక్తియుక్తులేంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా ఈ నెల 19న టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో కొత్త జాతీయ పార్టీ అనౌన్స్ చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా పాతెందుకు వ్యూహాలు రచిస్తున్నారని చర్చ సాగుతోంది. ఏదేమైనా తెలంగాణ కారు సారథి దేశరాజకీయాల్లో స్టీరింగ్ తిప్పేందుకు రెడీ అయ్యారు.
Corona Cases : రెక్కలు చాస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?