అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ కాగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో మహమ్మారికి నలుగురు బలవగా, 4,435 మంది బాధితులు వైరస్‌నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 0.10 శాతానికి చేరాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,07,08,541 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.