వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయని వెల్లడించారు.. వీటి కారణంగా రాష్ట్రంలో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందన్న టీఆర్ఎస్ ఎంపీ.. వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిందని.. తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు పంట వేస్తారని సభ దృష్టికి తీసుకెళ్లాను.. ఇక, ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం కేంద్రంతో మాట్లాడామని, ఒకసారి తీసుకుంటాం, మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని ఆరోపించారు ఎంపీ నామా నాగేశ్వరరావు..
సరైన సమయంలో ధాన్యం కొనుగోళ్లు జరగకపోడంతో తెలంగాణ రైతులు రోడ్డుమీదపడ్డారని, ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు సమావేశాలు జరిగాయి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపారని గుర్తుచేశారు నామా నాగేశ్వరరావు.. ఇక, ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేసిన నామా.. దీంట్లో కోటా కేటాయిస్తే, ఆ విషయాన్ని రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు రాజ్యసభలో ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ కె. కేశవరావు.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అది ఎటువంటి ధాన్యమైనా సేకరించాలన్నారు. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొంటామని ఓ కేంద్ర మంత్రి చెప్పారని, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని.. కానీ, ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్న కేకే.. గత ఏడాది తీసుకున్నంత ఈ ఏడాది తీసుకుంటారా? లేదా? అని అడిగారు. ఇలా.. లోక్‌సభ, రాజ్యసభలోనూ ఈ విషయాన్ని లేవనెత్తింది టీఆర్ఎస్ పార్టీ.