TPCC Vice President G Niranjan Demands Narcotic Tests For Talasani Malla Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్న సిట్ అధీనంలోకి ఇంకా కొన్ని అంశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యాక్షుడు జి. నిరంజన్ డిమాండ్ చేశారు. 2014, 2019లో గెలిచిన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్ ఏం ఎర వేసిందన్నది ప్రజలకు తెలియాలన్నారు. 2014 డిసెంబర్‌లో తలసాని శ్రీనివాస్ టీడీపీ సభ్యుడిగా ఉండి మంత్రి పదవి చేపట్టారని.. మల్లారెడ్డి కూడా 2016లో టీడీపీ ఎంపీగా ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి చేరారని అన్నారు. సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లోకి చేరినప్పుడు, వీళ్లకు ఏం ఎవర వేశారు? అని ప్రశ్నించారు.
మర్రి రాజశేఖర్ రెడ్డికి మేడ్చల్ నుంచి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం, తలసాని సాయికిరణ్‌కి సికింద్రాబాద్ ఎంపి టికెట్ ఇచ్చారంటే.. ప్రలోభాలు నిజమేనని నిరంజన్ బాంబ్ పేల్చారు. నిజాలన్ని బయటపడాలంటే.. తలసాని, మల్లారెడ్డికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని కోరారు. సిట్ రిమాండ్ రిపోర్ట్ పిటిషనర్‌కి అందించామని, తాము బయటపెట్టలేదని చెప్తున్నారన్నారు. మరి, ఆ లెక్కన ఆ రిపోర్ట్‌ని కోర్టు బయటపెట్టిందని చెప్తున్నారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ అడిగే ప్రశ్న ఒక్కటేనని, తాను లిక్కర్ స్కామ్‌లో ఉన్నారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడి, సీబీఐ కేసులు పెట్టి.. తనని జైల్లో పెట్టుకోండని కవిత చెప్తున్నారే గానీ.. తనకు ఆ కేసులతో సంబంధం లేదని కవిత చెప్పట్లేదని సందేహం వ్యక్తం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు తమ అమూల్యమైన సమయం ఈడీ, సీబీఐ కేసులకు కేటాయించాల్సి వస్తుందన్నారు.
అంతకుముందు.. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌పై నిరంజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ అధికార మదంతో ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అసలు కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. తన గురువైన మదన్ మోహన్‌కే కేసీఆర్ పంగనామాలు పెట్టారని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దేవత అని చెప్పి, ఆ తర్వాత మోసం చేసింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. కేసీఆర్‌ది తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజమని విమర్శించారు.