భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..!
ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు భయంతో పారిపోతుండగా, మరికొందరు శాస్త్రజ్ఞులు మాత్రం ఆకాశాన్ని చీల్చే బూడిద మేఘాలను ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు.
రేపు తెనాలికి వైఎస్ జగన్.. వాస్తవాలు తెలుసుకుని రావాలని మంత్రి సూచన
రేపు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్ తెనాలి రావాలి అని సూచించారు. ఎంతో ఘనత ఉన్న తెనాలిని గత ఐదేళ్లు గంజాయికి అడ్డాగా చేశారు అని ఆరోపించారు. రెండు గ్యాంగులు తెనాలిని అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరిపాయి.. గంజాయి బ్యాచ్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల పైనే కాకుండా పోలీసుల పైనా కూడా గంజాయి మత్తులో దాడి చేశారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్
చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి విశాఖకు వచ్చింది. బీచ్ టూరిజంకు అదనపు ఆకర్షణగా చేరింది. బీచ్ రోడ్డులో షికారు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెండు బస్సులను అధికారులు తీసుకుని వచ్చారు. బీచ్ రోడ్ కైలాసగిరి వరకు ఈ రైడ్ ప్లాన్ చేస్తున్నారు. డిమాండ్ ఆధారంగా భీమిలి వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. అయితే, విశాఖలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సులు సహకరించనున్నాయి. సింహాచలం ఘాట్ రోడ్డులో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది.
భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్‌లో తీవ్ర నీటి సంక్షోభం..
పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది.
101 జనసేన కుటుంబాలకు రూ.5 కోట్ల బీమా చెక్కుల పంపిణీ
ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు. వాళ్లకి కొంత ఆర్థిక భరోసా ఇవ్వగలిగామే గానీ.. వాళ్ళను వెనక్కి తిరిగి తీసుకురాలేమని పేర్కొన్నారు. అయినా గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఎంతో స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చెప్పుకొచ్చారు.
రాజధాని నిర్మాణానికి మరో 40 వేల ఎకరాలు కావాలి..
అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.. 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని అన్నారు. వీటితో పాటు 2500 ఎకరాలకు స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని నారాయాణ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం..
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ మార్కెట్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదు అన్నారు. కూటమి ఇచ్చిన హామీలను త్వరలో నెరవేర్చకపోతే.. వామపక్ష భావాలు ఉన్న పార్టీలను కలుపుకుని ఉద్యమం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు.
జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం.. అడ్డుకుంటే కోర్టుకు పోదాం..
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. మండల స్థాయిలో కూడా పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా నిరసన కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది.. అయితే, ప్రభుత్వం కొన్ని చోట్ల కార్యక్రమాన్ని అడ్డుకుంటే దానికి తగిన విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగించాలని సజ్జల పేర్కొన్నారు.
నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా.. ఎందుకంటే..?
జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్‌లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
రాజీనామా చేస్తా.. వైఎస్ జగన్కు మంత్రి లోకేష్ సవాల్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని వెల్లడించారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని పేర్కొన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు అని సెటైర్లు వేశారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం భూమిని రూపాయికే కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు.. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ – 3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.