రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు!
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి.. 20వ స్థానంలో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ డకెట్ (62,149) ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఓలీ పోప్ (మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి), జామీ స్మిత్ (ఎనిమిది స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి) కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. జో రూట్ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్ కాగా.. హ్యారీ బ్రూక్ రెండవ స్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్ సీఎంను తొలగించడానికి కుట్ర.. మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పదవి నుంచి తొలగించడానికి భారతీయ జనతాపార్టీలో కుట్ర జరుగుతోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదని అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో సొంత పార్టీ నాయకులు అతడికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించారని పేర్కొన్నారు. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక యువకుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.. అది చిన్న విషయం కాదని తెలిపారు. సీఎం పదవి నుంచి భజన్ లాల్ ను తప్పించే బదులు అతన్ని నిలబెట్టుకోవాలి అని అశోక్ గెహ్లాట్ సూచించారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్లు, NREGA కింద జీతాలు, విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సేవలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని జరగడం లేదు.. నాలుగు నెలలుగా ప్రజలకు పెన్షన్లు రావడం లేదు.. దాదాపు నాలుగు-ఐదు నెలలుగా NREGA కార్మికులకు జీతాలు అందడం లేదు.. వేసవిలో విద్యుత్ కోతలు పెట్టారు, నీటి సంక్షోభం గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పని చేసే వ్యక్తికి సామాన్య ప్రజల బాధలు పూర్తిగా తెలియవు.. అందుకే, రాజస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. ప్రజలు సహాయం కోసం ఏడుస్తున్నారు అని సీఎం భజన్ లాల్ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెక్సికోలోని గ్వానాజువాటోలోని ఇరాపువాటోలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం ఒక ఇంటి సమీపంలో వేడుకలు జరుగుతున్నాయి. స్థానికులు మద్యం సేవించి నృత్యం చేశారు. బ్యాండ్ వాయిస్తుండగా అందుకు తగ్గట్టుగా డ్యాన్స్‌లు చేశారు. అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. సంఘటనాస్థలిలోనే 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
నేడు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన!
రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 127 సంవత్సరాల రాజమండ్రి హేవలాక్ వంతెన, రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. అలానే గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంకను వినోద కేంద్రంగా మార్చనున్నారు. రూ.97 కోట్ల 44 లక్షల రూపాయలు అంచనాలతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఆరంభం అవుతోంది. బ్రిడ్జిలంకలో వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోటింగ్, క్రీడలు, రెస్టారెంట్స్, ధ్యాన మందిరం, ఆయుర్వేద కేంద్రాలు, ఈవెంట్ స్పేస్.. ఇంకా ఎన్నింటికో ప్రణాళికలు సిద్ధం చేశారు.
గోల్కొండపై తొలి బోనం.. ఆషాఢ బోనాలకు భక్తి శోభా ఆరంభం!
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నేడు (గురువారం) నుండి ఘనంగా ప్రారంభంకానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనం తో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలుకనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పోతరాజులు, నృత్య బృందాలతో పాటు తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ కోటకు ఉత్సాహభరితమైన ర్యాలీ నిర్వహిస్తారు. గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలను ఆభరణాలతో అలంకరించిన తరువాత, గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుంది. అక్కడ తొట్టెల సమర్పణతో మొదటి బోనం పూజ ముగుస్తుంది. ఇక బోనాల ప్రారంభానికి ముందురోజు అమావాస్యను పురస్కరించుకొని బుధవారం మహిళలు గోల్కొండ కోట మెట్ల వద్ద బొట్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముందురోజు మెట్ల పూజ నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.
సంతూర్ సబ్బుల లారీ బోల్తా.. సబ్బులను ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డ జనం..!
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నుజ్జునుజ్జయి అయిపోగా, మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన సంతూర్ సబ్బులను ఫుల్ గా లోడ్ చేసి తీసుకెళ్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి చుట్టుపక్కల ఉన్న జనం పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు చేరుకున్నారు. అయితే బాధితులకు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు లారీలోని సబ్బుల పెట్టెలను ఎగబడి తీసుకెళ్లడం ప్రారంభించారు.
దుర్గాపురం వద్ద కారు-లారీ ఢీ .. ఎస్సై, కానిస్టేబుల్ మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్‌ఐ అశోక్ , కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు , పోలీసులు కలిసి కారులో నుంచి బయటకు తీసి, తక్షణమే కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణాలు వేగం , నిద్రమత్తుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో ఉన్ 15-20 మంది కార్మికులు గల్లంతైనట్లుగా సమాచారం. ప్రాజెక్ట్ దగ్గర నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. బియాస్, సట్లెజ్ నదుల నీటి మట్టం పెరిగిందని అధికారులు చెప్పారు. వర్షాలు కారణంగా ప్రాజెక్ట్ పనులు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. తాత్కాలిక ఆశ్రయాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా వరద రావడంతో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కొంత మంది క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 20 మంది కార్మికులు గల్లంతయ్యారని ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర విపత్తు దళం, స్థానిక అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
నేడు వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి (ఏ3), ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (ఏ4).. మాజీ మంత్రులు పేర్ని నాని (ఏ5), విడదల రజిని (ఏ6)ల క్వాష్ పిటిషన్లపై కూడా న్యాయస్థానం విచారణ చేయనుంది. సింగయ్య భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. జగన్ కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ మొదట ప్రకటన విడుదల చేశారు.
చైనా ముందే పాకిస్తాన్ను ఏకిపారేసిన రాజ్నాథ్ సింగ్
చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి భారత్ తరపున కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. అయితే, గల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత ఆయన బీజింగ్ లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, భారతదేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజ్‌నాథ్ సింగ్‌కు సమావేశ వేదిక దగ్గర డ్రాగన్ కంట్రీ రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇతర నాయకులతో కలిసి రాజ్ నాథ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ గ్రూప్ ఫోటో సెషన్ సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది.. దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. తమై తరుచూ దాడులకు పాల్పడుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడనికి ఏమాత్రం వెనుకాడము అని తేల్చి చెప్పారు. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మనం కూడా చురుకైన చర్యలు తీసుకోవాలి అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లించారు.