చిరు – అనిల్ మరో షెడ్యూల్ స్టార్ట్
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారట. అలాగే ఇదే షెడ్యూల్ లో విక్టరీ వెంకీ కూడా జయిన్ అవుతారని సమాచారం. సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అందుకు అనుగుణంగానే షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. MEGA 157 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు లిటిల్ కు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
నేడు సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లు విడుదల..!
కలియుగ దేవుడు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. స్వామివారి దర్శనం కోసం సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను నేడు ఆన్లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను నేడు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే… నేడు (జూన్ 23)న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు స్వామి వారి శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనుంది. అయితే మంగళవారం (జూన్ 24)న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. కాబట్టి ఎవరైనా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నవారు ముందుగా ప్లాన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా టికెట్స్ ను పొందవచ్చు.
రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సులు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశారు. క్రికెట్‌తో బిజీగా ఉన్న కారణంగా రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. అయితే టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి మాత్రం తాను సిద్ధమని దాదా తెలిపారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఫిట్‌గా ఉండటం, భారత జట్టులో చోటు సంపాదించడం సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అంత సులువు కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా వ్యవహరించిన దాదా.. క్యాబ్, బీసీసీఐ అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు. 2018-19, 2022-24 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్‌కు టీమ్ డైరెక్టర్‌గా గంగూలీ ఉన్నారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. ‘క్రికెట్‌లో వేర్వేరు భిన్నమైన పాత్రల్లో ఉండటంతో రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. 2013లో క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి బీసీసీఐ అధ్యక్షుడిని అయ్యాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఇప్పుడు 52 ఏళ్లు. టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి నేను సిద్ధమే. అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం’ అని దాదా తెలిపారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశారు. భారత జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్ దాదానే అన్న విషయం తెలిసిందే.
సుపరిపాలనలో తొలి అడుగు.. నేడు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ గా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి.. అలాగే రాబోయే రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు.
ఇరాన్లో పాలన మార్పు రావాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఇరాన్ లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్‌గా మార్చాలని తన సోషల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ ఓ పోస్టు చేశారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ దేశంలోని అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని వెల్లడించారు. ఇరాన్ అణు కేంద్రాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసినట్లు వెల్లడించారు. అమెరికా సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. మరోవైపు, ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, సౌదీ అరేబియా, తుర్కియేల్లో ఉన్న అమెరికన్లు భద్రతపరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ కోరింది. ఇక, ఇజ్రాయెల్- ఇరాన్ తదితర దేశాల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో అమెరికన్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.
మధుర మీనాక్షి అమ్మవారికి, మురుగన్ భూమి తమిళనాడుకి కృతజ్ఞతలు.. డిప్యూటీ సీఎం పోస్ట్ వైరల్..!
ఆదివారం (జూన్ 22)న మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనకు అక్కడ ఘానా స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఆయన హిందుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, అలాగే తాను ఇంట్లోని విభూతి పెట్టుకొనే బడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. తాను అన్ని మాతాలను గౌరవిస్తానని, హిందువుగా ఉండడం గర్వంగా ఉందని అన్నారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. ఇందులో ధుర మీనాక్షి అమ్మవారి పవిత్రమైన భూమి మధురైకి, అలాగే శక్తి స్వరూపుడు మురుగన్ నేల తమిళనాడు మట్టికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. మీరు చూపిన ప్రేమ, భక్తి నాకు అపూర్వ అనుభూతిని కలిగించాయని.. ఈ పవిత్ర భూమి, ఇక్కడి ప్రజలు ధార్మిక భారతదేశ జీవరూపమే అంటూ రాసుకొచ్చారు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశమూ ఉన్నట్టు సమాచారం.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి.. భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్న అమెరికా..?
ఆపరేషన్ ‘మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో ఇరాన్ లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. సంబంధిత పోస్టులు అన్ని నకిలీవిగా తేల్చింది. ఆ ఆపరేషన్ సమయంలో భారత గగనతలాన్ని అమెరికా వినియోగించుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వెల్లడించింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డేనియల్ కెయిన్ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది.. సంబంధిత వీడియో లింక్‌ను ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది.
డిజిటల్ పేమెంట్ నేరాలకు ఇక చెక్..!
డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు అమితంగా పెరిగాయి. అయితే, ఈ వృద్ధికి అనుపాతంగా డిజిటల్ మోసాలు కూడా పెరుగుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తాజాగా, డిజిటల్ పేమెంట్‌కు సంబంధించి మోసాలను అరికట్టేందుకు ‘డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DPIP)’ అనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ డీపీఐపీ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వ రంగ , ప్రైవేట్ రంగ బ్యాంకులతో కలిసి రూపొందిస్తున్నారు. ఇది రియల్ టైమ్ డేటా షేరింగ్‌ను ఆధారంగా చేసుకుని, డిజిటల్ లావాదేవీల్లో జరుగుతున్న అనుమానాస్పద చర్యలను సకాలంలో గుర్తించేందుకు సహాయపడుతుంది.