విశ్వంభరపై అనుమానాలు.. చిరు తేల్చాల్సిందే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఈ సినిమా కంటే అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా గురించే హడావిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది.
సిగాచి పరిశ్రమ ఘటనలో 37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాషామైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రకటన వెలువడింది.
అనిరుధ్.. ఎదో చేస్తాడనుకుంటే.. ఎదో చేసాడు
కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కూలీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగా కూలీ ఫస్ట్ సింగిల్ చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రోమో ఫ్యాన్స్ లో భారీ ఎక్సపెక్టషన్స్ పెంచేలా చేసింది. కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక కొంత నిరుత్సహా పరిచింది. తమిళ తంబీలు ఆశించిన స్థాయిలో సాంగ్ లేదన్నది టాక్. సాంగ్ లో రజనీ పెద్దగా కనిపించకుండా అనిరుధ్, కొరియోగ్రాఫర్ శాండీ కవర్ చేసేయడాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మళ్లీ ట్రంప్-మస్క్ మధ్య రగడ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మరోసారి విభేదాలు తీవ్రం అవుతున్నాయి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మరోసారి మస్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జనాదరణ లేని ప్యాకేజీకి మద్దతు ఇచ్చే చట్టసభ సభ్యులను తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంపై ప్రచారం చేసి.. వెంటనే చరిత్రలో అతిపెద్ద రుణ పెరుగుదలకు ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి!’’ అని ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ‘‘నేను ఈ భూమిపై చేసే చివరి పని అదే అయితే వారు వచ్చే ఏడాది తమ ప్రాథమిక పరీక్షను కోల్పోతారు.’’ అని తీవ్ర హెచ్చరిక చేశారు.
నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ
తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులకు కోర్టు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తేడాలు ఉన్నట్లు పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక ప్రక్రియపై స్టే ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తుపై విచారణ జరుపుతోంది.
‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ఈరోజు అధిష్టానం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరు నిన్ననే ఖరారు కాగా.. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 10:45కు అధ్యక్షుని పేరును ప్రకటిస్తారు. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది. పీవీఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ వేయడంతో.. ఏపీ బీజేపీ చీఫ్ పేరు నిన్ననే ఖరారు అయింది. పీవీఎన్ మాధవ్‌కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేవైఎంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుటుంబం కూడా పార్టీ కుటుంబంగానే చెప్పుకోవాలి. బీజేపీ సీనియర్ నేత, దివంగత చలపతిరావు కుమారుడే మాధవ్. చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
ఒడిశాలో దారుణం.. ఆఫీస్‌లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు
ఒడిశాలో దారుణం జరిగింది. రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు రెచ్చిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. కార్యాలయంలోనే బీఎంసీ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సీనియర్ అధికారిని కొందరు ఈడ్చుకుని వెళ్తుండగా.. ఇంకొందరు కాళ్లతో తన్నుతో కనిపించారు. బయటకు లాక్కుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీపై భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని దుమ్మెత్తిపోశాయి.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ గారపాటి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ అధిష్ఠానం ఆయన పేరును అధికారికంగా ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒక్కటే నామినేషన్ రావడంతో, రామచంద్రరావు ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, డీకే అరుణ, రాజాసింగ్ వంటి నాయకుల పేర్లు చర్చలో ఉన్నా, అధిష్ఠానం రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది. అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రామచంద్రరావు పేరు ఖరారులో ఆర్ఎస్ఎస్‌తో పాటు పార్టీ సీనియర్ నేతల మద్దతు కీలకంగా నిలిచిందని తెలుస్తోంది. ఈ రోజు ఆయన ఎన్నికపై ఆధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.