‘‘పరువు హత్య’’.. 25 ఏళ్ల దళిత యువకుడి దారుణ హత్య..
తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా, కవిన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు.
పహల్గామ్ ముష్కరులు ఖతం.. హతమార్చిన భారత సైన్యం..
జమ్మూ కాశ్మీర్‌లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. అయితే, ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ అనుమానిత ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు సైన్యం జరుపుతున్న ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. హిర్వాన్ – లిద్వాస్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. గత 2 నెలలుగా ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ‘‘ఆపరేషన్ మహదేవ్’’ పేరుతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టి, ఉగ్రవాదుల్ని హతం చేశారు.
రాజమండ్రి జైలు వద్ద కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ మిథున్ రెడ్డి తల్లి..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్‌సభ ఎంపీ మిథున్‌రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎంపీ మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో నా కుమారుడిని టెర్రరిస్టుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు ఆయన కుటుంబ సభ్యులు.. అందులో మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్ ఉన్నారు.. ములాఖాత్ తర్వాత మీడియాతో మాట్లాడిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత.. సెంట్రల్ జైలులో తన కుమారుడికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్వంతమయ్యారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు..
నాకు పదవుల మీద ఆశ లేదు.. కానీ..!
నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు… జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.. మరోవైపు, జనసేన సభ్యత్వం ఏ కార్యాకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయని వ్యాఖ్యానించారు నాగబాబు..
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు బుద్ధి చెప్పాం
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. మతం పేరుతో పర్యాటకుల్ని చంపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టే ముందు భారత సైన్యం చాలా జాగ్రత్తలు తీసుకుందని.. పాకిస్థాన్‌లో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదన్నారు. బాధితులకు జరిగిన అన్యాయానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పారు. పాక్ న్యూక్లియర్ బాంబ్ బెదిరింపులను భారత్ ఏ మాత్రం ఖాతర చేయలేదని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా ఏంటో ప్రపంచమంతా చూసిందన్నారు.
రవాణా శాఖ లో సర్వీసు ఛార్జీలు మోత…
తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో చివరిసారిగా సర్వీస్ ఛార్జీలను సవరిస్తే, ఇప్పుడు మళ్లీ పెంపు చేపట్టడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కొత్త రేట్ల ప్రకారం, లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹200కు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹300కు పెంచారు. నాన్-ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌కు కొత్తగా ₹400 వసూలు చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌లో కొనుగోలు ధరపై 0.5% అదనపు ఛార్జీ వసూలు చేయగా, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై 0.1% పెంపు అమలులోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు ₹250కు చేరగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు ₹500కు పెరిగింది.
పత్తిరైతులకు గుడ్ న్యూస్.. బిల్లులు విడుదల..!
జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పత్తి విత్తనాలను సరఫరా చేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు సీడ్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గద్వాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోందని, రైతులు విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందించినప్పటికీ వారికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణామోహన్‌రెడ్డి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్రల షెడ్యూల్ ప్రకారం, జూలై 31న పరిగి పట్టణంలో సాయంత్రం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర అనంతరం పరిగి లో రాత్రి బస చేయనున్నారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆంధోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.
రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు
మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారని, కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు.. ఎలా పూర్తిచేశారన్నారు రాంచందర్ రావు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయపెట్టడంలేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుందన్నారు. అందులో వాస్తవాలు చెప్పి దాని ప్రకారం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని, రాజ్యాంగం మారుస్తారని, ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తారని అమిత్ షా మాట్లాడినట్లు కాంగ్రెస్ సృష్టించిందన్నారు రాంచందర్ రావు.
విజయ్ షాకు ఊరట.. సోఫియా ఖురేషి కేసులో సుప్రీంకోర్టులో ఉపశమనం
మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. విజయ్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 28 సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టేసింది. దీంతో మంత్రి విజయ్ షాకు భారీ ఉపశమనం లభించింది.