పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా..
నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు.. నిన్న గుడివాడలో జెడ్పీ చైర్మన్ హారిక, రాము దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.. గతంలో జరిగిన జడ్పీ సమావేశాల్లో కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించింది అని పేర్కొన్నారు. తప్పు చేసిందే కాకుండా బీసీ కార్డు తెరపై తెస్తున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
నటన అంటే ఏంటో చూపించాడు.. సీఎం చంద్రబాబు నివాళి..
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పనిచేశారు అని గుర్తు చేసుకున్నరు సీఎం చంద్రబాబు.
నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. సమాజానికి వారు చేసిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరిగింది. ఖాళీల భర్తీ నేపథ్యంలో వీరి నామినేషన్ జరిగింది. నామినేట్ చేసిన వారిలో ఉజ్వల్ నికమ్, సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, డా. మీనాక్షి జైన్ లు ఉన్నారు. ఇక వీరి వివరాలు పరిశీలిస్తే.. ఉజ్వల్ నికమ్ 26/11 ముంబయి దాడుల్లో కసబ్ కేసు ప్రాసిక్యూటర్‌గా నిలిచిన ప్రఖ్యాత న్యాయవాదిగా గుర్తింపు పొందారు. సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్తగా ప్రసిద్ధి గాంచారు. ఇక హర్షవర్ధన్ ష్రింగ్లా మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యనాయకుడుగా ఉన్నారు. చివరిగా డా. మీనాక్షి జైన్ చరిత్రకారిణి, రాజకీయ శాస్త్రవేత్త, విద్యావేత్తగా పేరుగాంచారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ట్వీట్లు చేశారు.
ప్రాజెక్ట్ అంటే హిందూ మహిళ, మతమార్పిడికి ఛంగూర్ బాబా కోడ్ నేమ్స్..
ఉత్తర్ ప్రదేశ్‌లో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు్న్నాయి. హిందూ అమ్మాయిలే లక్ష్యంగ మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చంగూర్ బాబాకు మతమార్పిడిల కోసం మిడిల్ ఈస్ట్‌లోని పలు ఇస్లాం దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా మతమార్పిడిల కోసం వందల కోట్లు సేకరించినట్లు తేలింది. కోడ్ పదాలు ఉపయోగించి మతమార్పిడిలను ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడైంది. వివిధ దశల్లో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి పలు కోడ్ నేమ్స్ వాడినట్లు గుర్తించారు. ప్రోత్సహకాలు, ఆర్థిక సాయం, వివాహ హామీల, బలవంతంగా బెదిరించడంతో అనేక మందిని ఆకర్షించాడు. ఎక్కువగా మహిళల్ని ట్రాప్ చేశాడు.
చెత్త గొడవ.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు..
భార్యాభర్తలు కలిసి వ్యక్తిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహా అలియాస్ చిన్న (32) తన భార్య అనిత(30) తో కలిసి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ లో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్పోస్ట్ లోని వెంకటరమణ లిక్కర్ ల్యాండ్ లో మద్యం సేవిస్తున్నాడు. అక్కడ నరసింహా అలియాస్ చిన్న తన భార్య అనితతో కలిసి స్క్రాప్ విషయంలో గొడవ జరిగింది. దీంతో చిన్న అనిత కలిసి నరసింహులు కర్రలతో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలై మృతి చెందాడు. స్థానికంగా ఉన్న వైన్ షాప్ క్యాషియర్ మహేష్ రాత్రి 8 గంటలకు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. భార్యాభర్తను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి
ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు. వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాయి. వాస్తవాలు రాయండి. సమాజం దృష్టితో వార్తలు రాయాలి. కొన్ని రాతలు బాధ పెడతాయి. అయినా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. నాటకీయంగా వ్యవహరించడం నాకు రాదు’’ అన్నారు తుమ్మల.
ధోని షర్ట్ ఐఫోన్ కంటే కాస్ట్లీ.. ధర ఎంతంటే?
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ధోని ధరించిన మ్యూజికల్ షర్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ షర్ట్ పై పియానో, దాని నోట్స్ ప్రింట్ చేసి ఉన్నాయి. ఆ షర్ట్ ధర అభిమానులలో ఉత్సుకతను రేకెత్తించింది. క్రికెట్ గ్రౌండ్ లో తన ఆటతీరుతో ప్రజల హృదయాలను గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. భారత మాజీ కెప్టెన్ జార్ఖండ్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి అంగీకరించారు. ధోని జార్ఖండ్ ప్రభుత్వ పర్యాటక, కళా సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సుదివ్య కుమార్ సోనును కలిశారు. ఈ సమావేశం JSCA స్టేడియంలో జరిగింది. ఈ సమయంలో, ధోని చక్కటి పట్టు వస్త్రంతో తయారు చేసిన నేవీ బ్లూ హాఫ్ స్లీవ్ షర్ట్ ధరించాడు. ఈ చొక్కాపై మ్యూజిక్ నోట్స్ ముద్రించబడ్డాయి. బ్రాండ్ పేరు పియానో కీలపై భుజం నుంచి ఛాతీ వరకు సృజనాత్మకంగా ఉంది. ఇది ఈ చొక్కాను మరింత ఆకర్షణీయంగా చూపించింది. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఆ చొక్కా ధర. ఈ స్టైలిష్ చొక్కా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అమిరి నుంచి వచ్చింది. దీని ధర $865 అంటే దాదాపు రూ.72,000. మీరు ధోని చొక్కా ధరకు ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయొచ్చు.
సారీ కాదు.. న్యాయం కావాలి.. లాకప్‌డెత్‌పై విజయ్ ఆగ్రహం
తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్‌డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. అత్యంత దారుణంగా పోలీసులు చితకబాదడంతో దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఇక మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పౌరుడిని పొట్టనపెట్టుకుందని ధ్వజమెత్తింది. అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్.. బాధిత కుటుంబానికి ఫోన్ చేసి సారీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ వైరల్ అయింది. తాజాగా ఇదే అంశంపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్‌కు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయ్ నల్ల చొక్కా ధరించి.. ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అంటూ ప్లకార్డును పట్టుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి అతి పెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోందని.. అన్నా యునివర్సిటీలో జరిగిన అత్యాచార కేసు దగ్గర నుంచి అజిత్ కుమార్ కేసు వరకు.. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి? అని ప్రశ్నించారు. న్యాయస్థానాలే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటూ విజయ్ పేర్కొన్నారు. డీఎంకే హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని.. వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని.. అజిత్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు.
సీఎంకు ఒకటే డిమాండ్.. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి
తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తే ఆడబిడ్డలను అమ్మవారిలా చూస్తామన్నారు. అలాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ బాధ్యత లేకుండా పరుష పదజాలంతో విమర్శలు చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మహిళలు రాజకీయాల్లోకి రావొద్దన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?’’ అంటూ ప్రశ్నించారు.
ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వెల్లడైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 32 సెకన్ల లోపే ‘‘ఇంధన నియంత్రణ స్విచ్’’ల సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతోనే ఇంజన్లకు ఇంధనం అందడం లేదని పేర్కొంది. ఈ సమయంలో కాక్‌పిట్‌లో పైలట్లు మాట్లాడుకుంటూ.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశామని ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను అలా చేయలేదని సమాధానం ఇచ్చారు. మొత్తంగా , ఇంధన నియంత్రణ స్విచ్‌లు వాటి అంతటా అవే ఆఫ్ అయినట్లు నివేదిక ప్రస్తావించింది.