టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందే..
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు. గత సభలకు మించి ప్రజల స్పందన ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందేనని వ్యాఖ్యానించారు. ఏపీలో 90 శాతం మందికి పైగా ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. అందరూ కలిసినా మాకేం కాదన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని.. పవన్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు.. ఇది అందరూ గమనించారన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజలు సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారన్నారు. 50 శాతానికి పైగా ప్రజలు జగన్ వెంట ఉంటే.. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదన్నారు. రానున్న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తారని భావిస్తున్నామన్నారు. మేము కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
“ప్లీజ్, మా వాళ్ల జాడ కనుక్కోండి”.. భారత్ సాయం కోరిన పాకిస్తాన్..
తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్‌ని బలవంతం చేస్తున్నారు.
పాక్ మీడియా డాన్ నివేదిక ప్రకారం.. కరాచీలోని మాలిర్ జిల్లాలోని మత్స్యకార గ్రామమైన ఇబ్రహీం హైదరీకి చెందిన 45 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే, వారి పడవ కేతిబందర్ సమీపంలోని హిజామ్ క్రో క్రీక్ వద్ద బోల్తా పడింది. మార్చి 5 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 31 మంది రక్షించబడగా.. 14 మంది కనిపించకుండా పోయారు.
కుటుంబం లేదని అంటున్నారు.. కానీ, దేశంలోని 140 కోట్ల మంది ‘మోడీ కా పరివార్’’..
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అజాంగఢ్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 34 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. భారతదేశ ప్రగతిపై అసంతృప్తితో, ఎన్నికల ముందు అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నికల ఎర అని కొందరు అంటున్నారు.. గత నాయకులు ఎన్నికల ముందు పథకాలు, ప్రాజెక్టులను ప్రకటిస్తారు కానీ పూర్తి చేసేవారు కాదని ప్రధాని అన్నారు. గతంలో తాను పునాది వేసిన ప్రాజెక్టులను ప్రారంభించడం దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిని విపక్షాలు చూడలేక పోతున్నాయని, వారి బుజ్జగింపు రాజకీయాలు క్షీణిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. కుటుంబ రాజకీయాలు చేసే వారు రోజురోజుకి మోడీని ద్వేషిస్తున్నారని, మోడీకి సొంత కుటుంబం లేదని అంటున్నారని, అయితే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమే ‘మోడీకా పరివార్’ అని మరిచిపోయారని చెప్పారు. ఆజంగఢ్‌పై ప్రేమ-అభివృద్ధి చూపించడం కులతత్వం, వంశ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఇండియా కూటమికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. దశాబ్ధాలుగా పూర్వంచల్ ప్రాంతం కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలను చూస్తోందని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో గత 7 ఏళ్లలో అభివృద్ధి చెందిందని ప్రధాని చెప్పారు.
లోక్‌సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. 42 స్థానాలకు టీఎంసీ అభ్యర్థులు ఖరారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. ఈ రోజు కోల్‌కతాలో జరిగిన టీఎంసీ మెగా బ్రిగేడ్ ర్యాలీలో ఆమె లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పఠాన్ పేరుంది. కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరికి పోటీగా యూసుఫ్ పఠాన్ బరిలో దిగుతున్నారు. బహరంపూర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించనప్పటికీ, చౌదరి లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన స్థానం నుండి మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే వివాదాస్పద నేత మహువా మోయిత్రాను మరోసారి టీఎంసీ కృష్ణానగర్ నుంచి బరిలోకి దింపుతోంది. సందేశ్‌ఖాలీ గొడవల నేపథ్యంలో బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ నుస్రత్ జహాన్‌ని తప్పించి, హరోవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నూరుల్ ఇస్లాంను రంగంలోకి దింపింది. అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి బాలీవుడ్ స్టార్ శత్రుఘ్ను సిన్హాను, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులను టీఎంసీ పోటీలో నిలబెట్టింది. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో ఎంపీగా బహిష్కరించబడిని మహువా మొయిత్రాకు టీఎంసీ మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపింది.
పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉంది.. మిగిలిన మూడు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మంత్రి తెలిపారు.
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పూర్తిగా మూసివేస్తున్నారు..
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను పూర్తిగా మూసివేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కాకినాడ, విశాఖపట్నం, మూలపేట, ఎన్నోర్ పోర్టులకు సంబంధించి ఎన్ని వెజల్స్ వస్తున్నాయనే విషయంపై షెడ్యూల్ వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడకు కంటైనర్లు వచ్చే అవకాశం లేదు.. కాబట్టి షెడ్యూల్ రాలేదని ఆరోపించారు. మంత్రి కాకాణి ఈ విషయంలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కంటైనర్ టర్మినల్ ను తొలగిస్తే కాకాణి రాజీనామా చేస్తానని చెప్పారని సోమిరెడ్డి తెలిపారు. గతంలో బండేపల్లి, డేగపూడి కాలువ పనులకు సంబంధించి కూడా ఇలానే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆందోళన చేస్తే హడావిడిగా ఖాళీ కంటైనర్లతో ఒక వెజల్ ను తెప్పించారని.. దాన్ని చూపించి మంత్రి కాకాని హంగామా చేశారని పేర్కొన్నారు. ఈ ఖాళీ కంటైనర్లను తీసుకెళ్లడానికి ఈనెల 12న మరో వెజల్స్ రానుందని తెలిపారు.
మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇంకా శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో రోడ్లపై ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్ధం సభ ప్రాంగణం నుంచి రెండు వైపులా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో కార్యకర్తలు, జనాలు నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు.. వీవీఐపీ వాహనాలకు సైతం తిప్పలు తప్పడం లేదు.
ఇదిలా ఉంటే.. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార వైసీపీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని ముఖ్యమంత్రి జగన్ వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్‌గా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతోంది.
యూసుఫ్ పఠాన్ vs అధిర్ రంజన్ చౌదరి?.. కాంగ్రెస్‌కి షాకిచ్చిన దీదీ..
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీదీ ప్రకటనలో బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. బెంగాల్‌లో ఒంటరి పోరుకే మమత ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో పోరు మాత్రం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ నేత, పార్లమెంట్ కాంగ్రెస్ పక్షనేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెరహంపూర్ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ని టీఎంసీ బరిలోకి దింపింది.
నారీశక్తి ఏంటో నిరూపించాలి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు అంతా నారీశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మహిళా మోర్చ కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాలలో… వారు చేస్తున్న సేవలను ఈ సందర్బంగా కొనియాడారు డీకే అరుణ. బీజేపీ గెలుపులో నారీ శక్తిని నిరూపించాలన్నారు డీకే అరుణ. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశలో దేశంలో మోడీ పాలన సాగుతోందని, 33% రిజర్వేషన్ తో భవిష్యత్ లో మహిళలకు రాజకీయాల్లో సమూచిత స్థానం రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ ఇదివరకే స్పష్టం చేసింది.
కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు
కామారెడ్డి – జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికి అమలైంది ఉచిత బస్సు మాత్రమే, అది సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొండంత హామిలు ఇచ్చి ..గోరంత పనులు చేయడం లేదని, కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఉన్నా.. రైతు బంధు సక్రమంగా విడుదల చేయలేదు. ఎన్నికలయ్యాక నాలుగేళ్లు పరిస్దితి ఏంటో రైతులు ఆలోచించాలని, ప్రజల్లో కాంగ్రెస్ పై అసహనం పెరుగుతుందని , అసహనంతో ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో బొంద పెడ్తాం అంటున్నారన్నారు.
గెలిస్తే మగాడు, ఓడితే మగాడు కాదా..?
కామారెడ్డి – కామారెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్దాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి ఎన్నిక చేదు అనుభవం మిగిల్చింది. ఆ ఎన్నికల పై చర్చ వద్దు, జరిగింది జరిగిపోయిందన్నారు. గంప గోవర్ధన్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని, త్వరలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తినే పల్లెంలో మట్టిపోసుకున్నాం అనే భావన సామన్య ప్రజల్లో , రైతుల్లో ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కామారెడ్డి నుంచి జైత్రయాత్ర మొదలు పెట్టాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి.. రంగుల కలల సినిమా చూపించి నోటికొచ్చిన హామిలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారని, రాష్ట్రంలో గౌరవ ప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల తప్పు లేదని ఆయన అన్నారు.