రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధుల చేతుల్లో చిన్నారులు చితికిపోతున్నారు. చిన్నా, పెద్ద.. వావి వరుస కూడా చూడని కామాంధులు కామవాంఛతో రగిలిపోతూ చిన్నారులను కూడా వదలడం లేదు. తాజాగా ఒక అధికార పార్టీ నేత, సర్పంచ్ భర్త.. ఆరేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ సర్పంచి ఇంట్లో మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ కుటుంబం అద్దెకు దిగారు. వీరికి ఆరేళ్ల కుమార్తె.. ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. రోజు మహిళ ఉద్యోగానికి వెళ్తూ చిన్నారిని సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్తుండేది. రోజులానే గురువారం కూడా పాపను సర్పంచ్ ఇంట్లో వదిలి విధులకు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న బాలికపైన సర్పంచ్ భర్త కన్ను పడింది. ఆమెకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపి, దగ్గరకు తీసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి, కూతురు అనారోగ్యంగా ఉండడం గమనించి.. ఏమైందని అడగగా జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చింది. దీంతో భర్తను పిలిచిన వివాహిత సర్పంచ్ ని నిలదీసింది. చేసిన తప్పును ఒప్పుకోకపోవడమే కాకుండా తానేం చేయలేదని చెప్తూ బార్యాభర్తలిద్దరిని ఇంట్లో పెట్టి తాళం పెట్టాడు సర్పంచ్ భర్త.
బంధువుల సాయంతో శుక్రవారం బయటపడ్డ భార్యభర్తలు.. పోలీసులకు సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేశారు. చిన్నారిపై అఘాయిత్యం చేసినవాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి మద్దతుగా భారీ సంఖ్యలో ఎల్లారెడ్డిపేటలోని ప్రధాన రహదారిపై ప్రజలు బైఠాయించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.