ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు భక్తులతో నిండిపపోయాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయ పద్దతిలో కొనసాగాయి.
Read Also: ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్
వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను హారతితో కొలిచిన ఆచార్యులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చనలు చేశారు. మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవోత్సవం నిర్వహించి నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. కాగా ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది భక్తులు ప్రత్యేక వాహనాల్లో స్వామి వారి దర్శనానికి వచ్చారు.