ఈటల రాజేందర్ భూముల వ్యవహరం పై కలెక్టర్ నిన్న నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే కాగా ఈ నివేదిక పై ఈటల రాజేందర్ భార్య జమున అసహనం వ్యక్తం చేసింది. కలెక్టర్‌ను కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవాలంటూ విమర్శించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికిదిగారు. బీజేపీ, ఈటలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈటల తప్పు చేశాడని మెదక్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, కానీ ఈటల జమున, రాజేందర్ కలెక్టర్‌ను బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు.
70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు కలెక్టర్ తేల్చారన్నారు. కాగా ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికీ ఈటల బుకాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను ఈటల గుంజుకున్నారన్నారు. ఈటల ఒక దగాకోరు అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చివేయాలన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరని త్వరలోనే బీజేపీకి, ఈటలకు ప్రజలు బుద్ధి చెబుతారని బాల్క సుమన్ హెచ్చరించారు.