ఒమిక్రాన్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దాంతో వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతటితో 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగిసినట్టు కాదని తెలిపింది.
Read Also:జీవో 317 తో దళిత ఉద్యోగులకు నష్టం: నగరిగారి ప్రీతం
ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిబిషన్ నిలిపివేయడంపై ఎగ్జిబిషన్ సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లు, మాల్స్‌కు లేని ఆంక్షలు.. ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారంటూ ఎగ్జిబిషన్ సొసైటీ తరఫు న్యాయవాది వాదించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ ఒమిక్రాన్ వంటి ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అంటూ ప్రశ్నించింది. కోవిడ్ పరిస్థితిలో ఎగ్జిబిషన్ ఉంచాలా, లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేసింది.కాగా నుమాయిష్‌లో కరోనా జాగ్రత్తలతో నడపాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో నుమాయిష్‌ను నిర్వహించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రజల ప్రాణాల కన్నా ప్రభుత్వానికి ఆదాయమే ముఖ్యమా అంటూ ప్రభుత్వానికి కోర్టు చురకలు అంటించింది.