Thatikonda Rajaiah : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికపై ఈ స్థాయి వ్యక్తిగత వ్యాఖ్యలు కావడం హాట్ టాపిక్‌గా మారింది. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.
అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.
అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.
మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Varanasi Gangrape Case: 19 ఏళ్ల బాలికపై 23 మంది గ్యాంగ్ రేప్.. తొమ్మిది మంది అరెస్ట్!