Rajya Sabha Members : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మరపురాని ఘట్టమని అభివర్ణించారు.
తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటు, మద్దతు తెలిపిన సీపీఐ, ఎంఐఎం నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శాసనసభ మొత్తం ఏకాభిప్రాయంతో తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
రాజ్యసభ సభ్యుడిగా తన ప్రధాన బాధ్యత తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమేనని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. “తెలంగాణ వాణిని ఢిల్లీ వేదికగా బలంగా వినిపిస్తా. రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు , ఇతర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను” అని ఆయన హామీ ఇచ్చారు.
తన మీద నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రివర్గ సహచరులు తనకు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. 2004-2009 మధ్య కాలంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు దేశ అత్యున్నత సభలో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సింఘ్వీ వంటి సీనియర్ నాయకుడు తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించడం వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!
