తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60 స్థానాలు, ఇతరులు 150 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ నాయకులు దీనిని ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదంగా అభివర్ణించారు.
Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
పోలింగ్ జరిగిన స్థానాలతో పాటు, ఎన్నికలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకగ్రీవమైన 45 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 32 స్థానాలను దక్కించుకుంది. నల్గొండ జిల్లాలో 17, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి జిల్లాలో 10 ఏకగ్రీవ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయ డంకా మోగించారు.
మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగ్గా, కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు మ్యాన్యువల్‌గా జరుగుతున్నందున, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెల్లడికావడానికి కొంత ఆలస్యం అవుతోంది. ఏదేమైనా, ఎంత ఆలస్యమైనా ఈరోజే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో దాదాపు 79.15% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Droupadi Murmu : ఈనెల 17న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము