తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన మొత్తానికి విజయవంతంగా ముగిసింది. ఈనెల 18న లండన్ వెళ్లిన ఆయన అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తరువాత స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 45 కంపెనీల బృందాలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి క్లుప్తంగా వివరించి అభివృద్ధి పథంలో ముందున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. దీంతో ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తానికి కేటీఆర్ కృషి ఫలితంగా తెలంగాణకు దాదాపు రూ.4,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఎకనామిక్ సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం మన దేశమే కాకుండా పలు మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు సైతం తెలంగాణ పెవిలియన్‌ను ప్రశంసించారు. కేటీఆర్‌తో సమావేశాలకు, చర్చాగోష్ఠులకు తెలంగాణ పెవిలియన్ వేదికగా నిలిచింది. ఈ వేదికపై అక్కడి ఫార్మా లైఫ్ సైన్స్ తో పాటు ప్రముఖ యునికార్న్ వ్యవస్థాపకులతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. వీటితోపాటు WEF ప్రధాన మందిరం, ఇండియా పెవిలియన్, CII పెవిలియన్‌లలో జరిగిన చర్చల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ పర్యటన వల్ల తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటన విజయవంతం కావడానికి తోడ్పడిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న ప్రముఖ కంపెనీలు
1. హ్యుందాయ్ గ్రూప్ సీఐవో యాంగ్చో చి తెలంగాణలో రూ.1400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుచేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో హ్యుందాయ్ ఈ పెట్టుబడి పెట్టనుంది. మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు కూడా హ్యుండై అంగీకరించింది. ఇది రాష్ట్ర మొబిలిటీ రంగానికి గొప్ప బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
2. ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్లు, ఇతర పరికరాలను తయారుచేసే జీఎంఎం పీఫాడులర్ సంస్థ కూడా హైదరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరించడానికి రెడీ అయ్యింది. హైదరాబాద్‌లో ఉన్న తన తయారీ కేంద్రంపై 6.3 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 300కి చేరనుంది.
3. స్వీడన్‌కు చెందిన ప్రసిద్ధ EMPE డయాగ్నొస్టిక్స్ హైదరాబాద్‌లో క్షయ వ్యాధి (TB) టెస్ట్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. రూ. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. దీనిద్వారా నెలకు 20 లక్షల టిబీ టెస్ట్ కిట్‌లను తయారుచేయనుంది ఈ సంస్థ. ఈ కిట్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించి అదనంగా మరో 50 కోట్ల పెట్టుబడితో దాదాపు 150 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాన్ని కల్పించనుంది.
4. రాష్ట్రంలో కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైలు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై స్టాడ్లర్ రైలు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సంతకాలు చేశారు. త్వరలో మేధో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి సంయుక్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించబోతున్నారు. ఒప్పందంలో భాగంగా రాబోయే రెండేళ్లల్లో తెలంగాణలో వేయి కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. స్టాడ్లర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాకతో సుమారు 2,500 మందికి ఉపాధి దొరకనుంది.