టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని ప్రకటన చేశారు… ఆ ప్రకటన చేసి హిందుత్వ పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని ఫైర్ అయ్యారు.
ఇక, ఇది కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌కు మధ్య జరుగుతున్న వ్యవహారం.. తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం కాదని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.. వారు ఒకే గూటి పక్షులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కేసీఆర్, ఈటల అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని.. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనది… సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారి విధానానికి భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్‌నిర్మాణాన్ని మార్చారని ఆరోపించారు.. మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల.. తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించారని విమర్శించారు. అందులో భాగంగా పేదల భూములను ఆక్రమించారని ఫైర్ అయిన జగన్… సీఎం కేసీఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటల గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడని పేర్కొన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం అని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బీజేపీ చేరాడన్న ఆయన.. మావోయిస్టులు కూడా తనకు మద్దతిస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలకు తెలియజేశారు.. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు నేత జగన్.