Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
55 ఏళ్లలో తెలంగాణలో సంభవించిన రెండో అతిపెద్ద భూకంపం ఇదే. ములుగు సమీపంలోని గోదావరి నదిలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందు 1967లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, అప్పటి నుంచి చిన్నపాటి భూకంపాలు నమోదయ్యాయి. 5 తీవ్రతతో రావడం చాలా అరుదు. కానీ ఈ రోజు మాత్రం ములుగు దాని చుట్టుపక్కల ప్రాంతాలు బలమైన భూకంపాన్ని ఎదుర్కొన్నాయి.
Read Also: TG Police Dept: తెలంగాణ పోలీస్ సంచలన నిర్ణయం.. ట్రాఫిక్ విధుల్లో 44 మంది ట్రాన్స్ జెండర్లు
నిజానికి ఈ ప్రాంతం తరుచుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కాదని, తీవ్రస్థాయిలో భూకంపాలు రావని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని 59 శాతం వివిధ తీవ్రతలతో భూకంపాలకు గురువుతుంటుంది. భూకంపాలు సంభవించే ప్రాంతాలను, వాటి తీవ్రత దృష్ట్యా జోన్ II, జోన్ III, జోన్ IV , జోన్ Vగా 4 జోన్లుగా విభజించారు. జోన్-5 అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతం. అతితక్కువ తీవ్రత కలిగిన ప్రాంతం జోన్-2. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కువ స్థాయి భూకంపాలు సంభవించే జోన్-2లో ఉంది.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉంది. ఇది భూకంపానికి కారణమవుతుంది. ఫాల్ట్ జోన్ అంటే భూమి అంతర్భాగంలో రెండు బ్లాకులు ఒకదానితో ఒకటి ఆకాస్మాత్తుగా జారిపోయే ప్రదేశం. ఒక్కోసారి అంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే అపారమైన శక్తి భూకంపాలుగా వస్తుంది. గోదావరి బేసిన్‌లో పలు చోట్ల పగుళ్లు, లోపాలు ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.