కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, డీజీపీ, పౌరసరఫరాల శాఖ నివేదికపై వాదనలు జరిగాయి. హెల్త్ సెక్రటరీ రిజ్వీ కూడా హైకోర్టుకు హాజరయ్యారు. లాక్‌డౌన్ సడలింపుల గురించి వైద్యశాఖ కోర్టుకు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువ ఉన్నందున.. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపింది. థర్డ్‌వేవ్ చర్యలపైనా కేబినెట్ చర్చించిందని కోర్టుకు చెప్పింది వైద్యశాఖ. బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేషన్ సదుపాయాలపైనా చర్చించారని తెలిపింది. అయితే గతంలో ప్రైవేట్ ఆస్పత్రులకు జీవో ఇవ్వాలని చెప్పినా… ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది. దీంతో జీవో జారీకి 4 వారాల సమయం కావాలని కోరారు హెల్త్ సెక్రెటరీ. రెండు వారాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు జీవో జారీ చేయాలన్న హైకోర్టు ఆదేశించింది. జూన్ 23లోగా జీవో అమలులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది హైకోర్టు.
ఇక, కోవిడ్ థర్డ్ వేవ్ ఎలా ఎదుర్కొంటారనేదానిపై బ్లూ ప్రింట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.. దీనికి బదులిచ్చిన హెల్త్ డైరెక్టర్.. అర్బన్ మోడల్ వైద్య పరీక్ష కేంద్రాలను 19 జిల్లాలో ఏర్పాటు చేశామని హైకోర్టుకు తెలిపారు.. కేబినెట్ నిర్ణయం ప్రకారం అవి 33 జిల్లాలకు విస్తరించాలని చూస్తున్నామన్నారు.. విద్యాశాఖ అధికారులు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు.. ఎన్నికల కారణంగా కోవిడ్ తో చనిపోయిన టీచర్లకు కోవిడ్ వారియర్లగా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి గతంలోహైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.. సివిల్ సప్లైస్ అధికారులకు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.. మరోసారి పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.