తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఈ మేరకు రేపు సెలవు ప్రకటిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంబరాలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరోవైపు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ మహిళా బంధు పేరిట వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన మహిళలను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కలిసి సన్మానం నిర్వహించారు.