హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాడిసన్ హెటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్‌ను, లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారా హిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి రాడిసన్ హోటల్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ హోటల్‌కు చెందిన పబ్‌లో డ్రగ్స్ దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
కాగా గతంలో 24 గంటలపాటు లిక్కర్ సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. ఈ ఏడాది జనవరి 7న లిక్కర్ లైసెన్స్‌కి అనుమతి లభించింది. రూ.56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి రాడిసన్ హోటల్ లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పబ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అభిషేక్ ఉప్పాల, అనిల్‌కుమార్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజు పరారీలో ఉన్నారు. రాడిసన్ హోటల్‌ను 2017లో కిరణ్ రాజు అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ రాజు పబ్‌ను నడిపాడు. 2020 ఆగస్టులో అభిషేక్, అనిల్‌కుమార్‌కు కిరణ్ రాజు లీజుకిచ్చాడు. ఈ ఏడాది జనవరి నుంచి పబ్‌ని అభిషేక్ గ్యాంగ్ నడుపుతోంది. అభిషేక్ పబ్ నడుపుతున్నప్పటికీ భాగస్వామిగా కిరణ్‌రాజు ఉన్నాడు.
https://ntvtelugu.com/pudding-and-mink-drugs-case-fir-details/