TG Cabinet : సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తదుపరి సమావేశం జులై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతోపాటు, ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 98 కేబినెట్ భేటీలు నిర్వహించగా, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 18 సమావేశాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాలనా నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు, వాటి అమలు పై సమీక్ష నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిరంతరంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు కేబినెట్ ఎజెండా, టేబుల్ ఐటమ్స్ వంటి సమాచారం మంత్రులకు హార్డ్‌కాపీల రూపంలో అందించగా, ఇకపై ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పరిపాలన విభాగం నిర్వహించే ఈ ఫైళ్లన్నీ ఇకపై ఈ-ఫైలింగ్ విధానంలో భద్రపరచనున్నారు. రహస్యత, భద్రత పరంగా ఇది మెరుగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువస్తున్నారు.
IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
ఈ వ్యవస్థను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని రెండు మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నదని సమాచారం. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేకంగా “స్టేటస్ రిపోర్ట్” కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. గత మూడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై శాఖల కార్యదర్శులు సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) సమర్పించి చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ సభ్యులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారు.
ఈ మార్పులన్నీ సమర్థమైన, పారదర్శకమైన పాలన కోసం తీసుకుంటున్న చర్యలుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, ప్రజాపాలనలో తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలబెట్టాలన్న దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
WI vs AUS: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆసీస్ టెస్ట్ మ్యాచ్.. స్వల్ప లీడ్‌లో విండీస్