Telangana Assembly Session 2025 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వేడెక్కాయి. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. గతంలో రిజర్వేషన్ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపితే పెండింగ్లో పడిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందని, కానీ బీఆర్ఎస్ వెనక్కి తగ్గిందని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ “కల్వకుంట్ల కాదు, కలవకుండా చేసే కుటుంబం” అని రేవంత్ ఎద్దేవా చేశారు. సభలో ఒకరిపై ఒకరు అవమానాలు చేసుకోవడం వల్ల ప్రజల ముందు చులకన అవుతారని ఆయన హెచ్చరించారు.