TS Assembly Budget Session: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రేపు ఉదయం గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇక, ఫిబ్రవరి 6న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఆర్థికమంత్రి హరీష్ రావు. ఈనెల 15 వరకు సమావేశాలుంటాయని తెలుస్తోంది. బీఏసీ భేటీ తర్వాత.. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది. అయితే, గవర్నర్ ప్రసంగంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సయోధ్య తర్వాత గవర్నర్ స్పీచ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రసంగం అనంతరం రాజ్ భవన్, ప్రభుత్వం సంబంధాలు మెరుగుపడతాయా? లేదంటే మళ్లీ ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు వస్తాయా? గవర్నర్ స్పీచ్ వ్యవహారం అంతా సాఫీగా సాగుతుందా ? ఇలా అనేక ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి.
Read Also: BRS in AP: ఏపీలో బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్..! గంటా, సీబీఐ మాజీ జేడీతో వివేక్ భేటీ..
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు పెంచుతున్నారు.. కానీ, ఖర్చు చేయడం లేదన్నారు. ఇక, హాత్ సే హాత్ జోడో యాత్ర లు రెండు నెలలు ఉంటాయి..అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారం .. యాత్రలు చేస్తామన్నారు.. రాష్ట్రమంతా పాల్గొంటా.. పార్టీ ఎక్కడ నుండి నడవమని అంటే అక్కడి నుండి నడుస్తా.. ఎల్లుండి ఇంచార్జి తో సమావేశం ఉంది. సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్రలపై స్పష్టత వస్తుందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు భట్టి. మరోవైపు.. అంకెల గారడీ తప్ప, బీఆర్ఎస్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏమీ వుండదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామన్నారు. రైతు సమస్యలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, గురుకుల విద్యార్థుల సమస్యలు, శాంతి భద్రతలు, ప్రతి పక్ష నేతలపై దాడులు అసెంబ్లీ లో ప్రస్తావిస్తాం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.. గవర్నర్ ప్రసంగంలో మంచి విషయాలు ఉండాలి.. ఏది పడితే అది రాసి ఇవ్వొద్దు.. కేంద్రంపై ఎదురుదాడి చేసే విధంగా ఉండొద్దు అని సూచించారు. ఇక, కేసీఆర్ బడ్జెట్ ఓట్ల కోసం.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందని విమర్శించారు ఈటల రాజేందర్. మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై అధికార, విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. అయితే, గవర్నర్ ప్రసంగం ఎలా వుంటుందన్నదే ఉత్కంఠ కలిగిస్తోంది.