Tarun Chugh Comments On TRS: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు ఇది జరిగిన రోజు వ్యవధిలోనే దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యాడు.
ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఉందని.. మా విద్యార్థి పరిషత్ లో పనిచేసిన శ్రావణ్ నాలో భేటీ అయ్యారని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఇద్దర చర్చించాం అని తెలిపారు. తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని.. ఆయన విమర్శించారు. బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో ప్రజా సంగ్రమ యాత్ర, మోటార్ సైకిల్ యాత్ర జరుగుతుందని అన్నారు. ప్రజల ఆశలను టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు.
దాసోజు శ్రవణ్ పై వేలెత్తి కాంగ్రెస్ నేతలు మాట్లాడలేరని అన్నారు తరుణ్ చుగ్. ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీార్ అదికారాన్ని కోల్పోతారని అన్నారు. కేసీఆర్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. బీజేపీలో చేరే వారి సంఖ్య చాలా పెద్దదని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆయన అన్నారు.