జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాల లెక్క తెలియదా? లబ్ధిదారుల వివరాలు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా? కొబ్బరికాయలు కొట్టడం.. రిబ్బన్ కటింగ్ చేయడంపై ఉన్న శ్రద్ధ పథకాల ప్రచారంలో చూపెట్టడం లేదా? ఈ అంశాలపైనే ఇప్పుడు పార్టీ పెద్దలు చురకలు వేశారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా ప్రజాప్రతినిధి?
కల్యాణలక్ష్మి లబ్ధిదారుల వివరాలు అడిగే సరికి నీళ్లు నమిలారట..!
టీఆర్‌ఎస్ ప్లీనరీ.. విజయగర్జన సభ కోసం కొద్దిరోజులుగా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఓ సమీక్షకు నిర్మల్ జిల్లా బృందంతోపాటు ఆ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కార్యక్రమాల ప్రస్తావన వచ్చిందట. జిల్లాలో ఎంతమందికి ఈ పథకాలు అందాయి.. లబ్ధిదారుల సంఖ్య ఎంత అని కేటీఆర్ ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఆమె కాదు.. ఆ మీటింగ్‌లో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఫీజులు ఎగిరిపోయినట్టు టాక్.
ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నలు..!
మీటింగ్‌కు వచ్చిన ప్రజాప్రతినిధులు వివరాలు చెప్పే పరిస్థితి లేదని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇలా అయితే ఎలా అని ఒకింత గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లాలోని చెన్నూరు మినహా తొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులతో ఆ సమీక్ష జరిగింది. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని ఏదో ఒక ఫంక్షన్ హాల్‌లో పెట్టకుండా.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి అందజేయాలని.. లబ్ధిదారుల స్పందన తెలుసుకోవాలని కోరారట. ఈ పథకంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలియకపోతే.. ఇక పార్టీ కేడర్‌కు ఏం తెలుస్తుంది? పథకాలపై పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది? పార్టీ బలోపేతం కావాలంటే.. ఈ విషయాలపై అవగాహన ఉండాలి కదా అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించడంతో ప్రజాప్రతినిధులు బిక్కముఖం వేశారట. ఇకపై ఇలాగే ఉంటే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సైలెంట్ మోడ్‌లో నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులు ..!
తెలంగాణ భవన్‌లో జరిగిన మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ప్రజాప్రతినిధులు ఎక్కడా పెదవి విప్పడం లేదు. అంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. వామ్మో.. ఆ ప్రశ్న నన్ను అడిగి ఉంటే బుక్కయిపోయి ఉండేవాడినని ఎవరికి వారు అనుచరులకు చెప్పి నవ్వుకుంటున్నారట. ఇన్నాళ్లూ ఎవరో ఒకరు ఇవన్నీ చూసుకుంటారని అనుకున్నవాళ్లు సైతం.. ఈమీటింగ్ తర్వాత ప్రభుత్వ పథకాల లెక్కలతో కుస్తీ పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి పెన్ను పేపరుతో కనిపిస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను చూసిన వాళ్లకు మీటింగ్‌లో గట్టిగానే తలంటారని చెవులు కొరుక్కుంటున్నారు.