దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
జాతర ముగిసిన తరువాత కూడా లక్షలాది మంది భక్తులు మేడారంలో సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోనున్నారు. వాళ్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రులు తెలిపారు. మౌలిక వసతులు, సదుపాయాలు పెరగడంతో ఈ సారి మేడారం జాతరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ఈసారి జాతరలో ఎక్కడా ట్రాఫిక్ జామ్‌లు లేవని, భక్తులు ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కాగా మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు ప్రకటించగా.. దేవాదాయశాఖ మరో రూ.10 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.