‘SIR’ In Telangana: కేంద్ర ఎన్నికల సంఘం నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ను ప్రారంభించింది. తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తెలంగాణలో ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఎల్‌వోల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈసీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, యూపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌ను చేపట్టింది. ముఖ్యంగా, ఈ ప్రక్రియపై బీజేపేతర ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: Kerala: “బంగ్లాదేశీయుడి”గా పొరబడి వలస కార్మికుడి దారుణ హత్య..
ఇదిలా ఉంటే, ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మూడవ దశ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.68 కోట్ల మంది మహిళా ఓటర్లు కాగా, 1.66 కోట్ల మంది పురుష, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితే, తెలంగాణలో చనిపోయిన, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లతో పాటు నకిలీ ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారు. దాదాపుగా 50 లక్షల వరకు ఓట్లను తీసేసే అవకాశం ఉంది.