సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ.
ఇటీవల ఆర్ ఎల్ సి సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అంగీకారం తెలిపింది. మెడికల్ బోర్డు నిర్వహించడంలో జాప్యంతో వయోపరిమితి 35 సంవత్సరాలు దాటడంతో ఉద్యోగం దొరకని వారికి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది సింగరేణి సంస్థ.
అయితే.. 2022 ఏప్రిల్ 22న ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి సంస్థ అంగీకరించింది. ఇంకా 8 ఇతర అంశాలపై సహాయ కార్మిక కమిషనర్ లక్ష్మణ్ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య హైదరాబాద్ లో చర్చలు అనంతరం తాజాగా ఒప్పందం కుదిరింది. ఇటీవల కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై దశలవారీగా జరుగుతున్న చర్చలు బుధవారం నాడు సఫలీకృతమయ్యాయి.
ఒప్పంద పత్రంపై గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎస్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు, సింగరేణి యాజమాన్యం తరపున సంచాలకుడు ఎన్. బలరామ్, జీఎం ఆనందరావు సంతకాలు చేసిన విషయం తెలిసిందే..