‘పుష్ప: ద రైజ్’ సినిమా ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించడం, ముఖ్యంగా బాలీవుడ్‌లో వసూళ్ళ వర్షం కురిపించడంతో.. ‘పుష్ప: ద రూల్’ని గ్రాండ్ స్కేల్‌లో రూపొందించాలని దర్శకుడు సుకుమార్ ఫిక్సయ్యాడు. స్క్రిప్టుపై మరోసారి కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. ఈ సవరింపుల కారణంగానే.. ఫిబ్రవరి నెలలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ చిత్రం, ఇంకా జాప్యమవుతూ వస్తోంది.
నిజానికి.. మేకర్స్ ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరిలో షూట్ ప్రారంభించి, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ చెదిరిపోయాయి. మే నెల కావొస్తున్నా, సెట్స్ మీదకి తీసుకెళ్ళే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో, ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో రావడం గగనమేనని అంతా అనుకున్నారు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. మేకర్స్ ముందుగా చెప్పినట్టు డిసెంబర్‌లోనే ఈ సినిమాని తీసుకొస్తారట! స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని సమాచారం.
వీలైనంత త్వరగా సుకుమార్ ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, వరుస షెడ్యూల్స్ నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి, అనుకున్న సమయంలోపు ఈ సినిమా షూట్‌ని ముగించి, డిసెంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!