Telangana DGP Jitender: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్. పోలీస్ బాస్‌గా ఛార్జ్ తీసుకున్న జితేందర్‌కు పలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీకి ఛార్జ్ తీసుకోకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తనను డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీని మార్చడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
నూతన డీజీపీ జితేందర్ 2025 సెప్టెంబర్‌లో రిటైర్డ్ కానున్నారు. డీజీపీగా 14 నెలల పాటు సేవలు అందించబోతున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడుతానని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. నేరాల కట్టడికి, సైబర్‌క్రైమ్ నియంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Group-2: గ్రూప్ -2 పోస్టులను పెంచి డిసెంబర్‌లో నిర్వహించాలి.. ప్రభుత్వానికి అభ్యర్థుల విజ్ఞప్తి
పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పుడు డీజీపీగా నియామకమయ్యారు.