రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక షెడ్యూల్ కులాల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్. షెడ్యూల్ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. శనివారం అమీర్ పేటలోని టెక్ నాలెడ్జ్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నిర్వహిస్తున్న క్యాంపస్ ట్రైనింగ్ ప్రోగ్రాం వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంస్థ డైరెక్టర్ దండు సాయి కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం 50 కోట్ల రూపాయల వ్యయంతో విద్య ఉపాధి అవకాశాలపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారని అన్నారు. డిగ్రీ పూర్తయి టెక్ నాలెడ్జ్ ద్వారా ట్రైనింగ్ తీసుకుని వివిధ కంపెనీల్లో రిక్రూట్ అయిన విద్యార్థులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆనంద్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.