అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా… రోడ్డు ప్రయాణాల్లో వాహనదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అమాయక ప్రజల మరణాలకు కారణం అవుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కనీసం సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనల గురించి అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. అధికారులు రోడ్డు నిబంధన గురించి అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి అప్పా దగ్గర రోడ్డు ప్రమాదానికి కూడా కారణం ఈ నిర్లక్ష్యమే. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలయ్యారు. నార్సింగి అప్పా జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు రోడ్డుపై ప్రయాణిస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా కార్ డోర్ తెరిచి రోడ్డుపై ఉమ్మేశాడు కారు యజమాని. ఇదే సమయంలో వెనుకనుంచి వస్తున్న మోటార్ సైకిల్ కార్ డోర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డుపై పడ్డాడు. దీంతో అతనిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో బైకిస్టు స్పాట్ లోనే మరణించాడు. మృతుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మేస్త్రీ గా గుర్తించారు పోలీసులు. పొట్ట చేతిన పట్టుకుని నగరానికి వచ్చిన వ్యక్తి ఒకరి నిర్లక్ష్యానికి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు కారణం అయిన కారు యజమాని ఎల్లయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేేస్తున్నారు.