టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఒక దశ దిశ చూపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని… తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్న జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో డెవలప్మెంట్ లేదని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికీ కూడా రెవెన్యూ విలేజ్ హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. మైకుల ముందు తండాలను గ్రామపంచాయతీలు చేశామని పెద్దపెద్ద మాటలు చెబుతారు కానీ.. జయశంకర్ సార్ ఊరికి ఇప్పటికీ రెవెన్యూ హోదా ఇవ్వలేదంటే ఆయన పట్ల మీకున్న గౌరవం అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. దళిత బంధు అని గొప్పలు చెప్పుకుంటున్నా… దళితుల్లో ఎలాంటి మార్పు రాలేదని లేఖలో విమర్శించారు. అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు( ఓఆర్ఆర్) నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరిస్తుందని…కాంగ్రెస్ పార్టీ మౌళిక సదుపాయాలకు వ్యతిరేఖం కాదని.. అయితే ఓఆర్ఆర్ పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతుందని ఆరోపించారు. ఓఆర్ఆర్ కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో 24,517 ఎకరాలు సేకరిస్తోందని… దీంతో లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డన పడే పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. ఇందులో అధిక శాతం రెండు, మూడెకరాలు కలిగిన సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని.. ప్రభుత్వం వారి నోటికాడి ముద్దనను లాక్కుంటుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కి తీసుకోవాలని… లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తుందని లేఖలో పేర్కొన్నారు.