CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆయన బీజేపీతో పాటు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును హరించాలనే ప్రయత్నాలు గతంలో జరిగినట్టు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితరుల పోరాటాల వల్లే దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కిందని చెప్పారు.
ఇప్పుడు అదే ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలతో ముందుకు సాగుతున్న బీజేపీ మళ్లీ ప్రజల ఓటు హక్కును లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పోరాటం అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మహా ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొనగా, రేవంత్ రెడ్డి ప్రసంగానికి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల నుంచి భారీ స్పందన లభించింది.