Revanth Reddy On AICC Elections: ఏఐసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్ధంగానే జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఓటరు లిస్ట్‌కి, పీసీసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎన్నికల డేలిగేట్స్ అంతా పైనుండే వస్తుందని.. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని, తాను కేవలం ఓటరు మాత్రమేనని, తాను తన ఓటు వేసుకున్నానని తెలిపారు. మిగతాదంతా పీఆర్వో వాళ్లే చూసుకున్నారన్నారు. అర్హత లేని వారికి ఇచ్చారని భావించినా, ఎవరికైనా ఏమైనా అపోహలు ఉన్నా.. ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఉప ఎన్నికల్లో ఫ్రీ సింబల్స్ ఇవ్వొద్దనే అధికారం ఎవ్వరికీ లేదని, కారు గుర్తు కూడా ఒకప్పుడు ఫ్రీ సింబలేనని అన్నారు.
మరోవైపు.. ఏఐసీసీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారి రాజమోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 238 పీసీసీ డెలిగేట్స్ ఉన్నారన్నారు. ముగ్గురు ఏఐసీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఎన్నికలు సజావుగా సాగాయని వెల్లడించారు. రేపు ఎన్నికల సంఘానికి తాము బ్యాలెట్ బాక్స్ అందజేస్తామని, 19వ తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పారు. కాగా.. ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. దేశవ్యాప్తంగా సగటున 96 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరిగింది. ఎవరికైతే 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందుతారో.. వారినే విజేతగా ప్రకటిస్తారు. సీనియర్ల మద్దతు ఎక్కువగా ఉన్న మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.