తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసింది. కోవిడ్ రూల్స్‌ను కూడా పాటిస్తున్నారు. వైద్య సిబ్బందిని సైతం పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
కరీంనగర్‌లో రెండు స్థానాలకు 10 మంది పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఒక్క స్థానానికి ఇద్దరూ పోటీ పడుతున్నారు. నల్గొండలో ఒక్క స్థానానికి ఏడుగురు పోటీలో ఉన్నారు. ఖమ్మంలో ఒక్క స్థానానికి నలుగురు పోటీలో ఉన్నారు. మెదక్‌లో ఒక్క స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నారు. కాగా రెండు వారాల కిందట ఉత్తర, దక్షిణ భారత్ యాత్రలకు వెళ్లిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గురువారం సొంత జిల్లాలకు చేరుకున్నారు. ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.