సాధారణంగా బతికి వున్న వారి పేరుమీద మాత్రమే ఇళ్ళు, స్థలాలు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ డబ్బులిచ్చవారుంటే చనిపోయినవారి పేరు మీద కూడా చక్కగా రిజిస్ట్రేషన్ చేసేవారున్నారంటే మీరు నమ్ముతారా? ఇచ్చట ఆత్మలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయబడును.! అవును మీరు వింటున్నది నిజమే..! చనిపోయిన వారి పేరుపై కూడా చేసేస్తారు? నమ్మడం లేదా? సరే ఒక్కసారి కరీంనగర్ వెళ్లొద్దాం రండి.
కరీంనగర్లోని సవరన్ స్ట్రీట్ లో 2 గుంటల స్థలంలో ఇల్లు కటకం చంద్రయ్య పేరున ఉంది. అయితే పదేళ్ల క్రితం ఉపాధి కోసం పూణె వెళ్లి స్థిరపడ్డారు. ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిధిలావస్థకు చేరింది. అయినా ఇంటిపన్ను మాత్రం రెగ్యులర్‌గా కడుతూ వస్తున్నాడు. ఖాళీగా ఉన్న ఈ ఇంటిపై స్థానిక ప్రజా ప్రతినిధి కన్ను పడింది. కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. కటకం చంద్రయ్య బంధువు నీలమ్మను తెరపైకి తెచ్చాడు. ఆ ఇల్లు నీలమ్మదని… పొరపాటున చంద్రయ్య పేరు రికార్డుల్లో చేర్చారని… ఇప్పుడు తిరిగి నీలమ్మ పేరున మార్చాలని అధికారులపై ఒత్తిడి తెచ్చాడు.
గత మార్చి 21న మునిసిపాలిటీ అధికారులకు నీలమ్మ పేరుతో దరఖాస్తు చేయగా మూడు రోజుల్లో ఆమె పేరుపై ఇల్లు మార్చేశారు. ఇంతవరకు సదరు ప్రజా ప్రతినిధి కథ బాగానే నడిపాడు. తీరా చూస్తే నీలమ్మ 2006లోనే చనిపోవడం… ఆమె డెత్ సర్టిఫికెట్ కార్పొరేషన్ నుంచే ఇవ్వడం జరిగాయన్న విషయం బయటకు రావడంతో కబ్జా కోరు కథ బట్టబయలైంది. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితో చనిపోయిన మహిళ పేరుపై ఇంటిని మార్చేసిన అధికారులు… ఇప్పుడు వ్యవహారం బయటపడేసరికి తేలుకుట్టిన దొంగల్లా కూర్చున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్ పై అధికారులు ఏం చేస్తారో చూడాలి.
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి నేటితో మూడేళ్లు పూర్తి