సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకు ఏకంగా 151 సీట్లలో ఘనవిజయం సాధించి మే 30, 2019న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా జగన్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తూచ తప్పకుండా అమలు చేస్తోందని వైసీపీ నేతలు చెప్తున్నారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి ఆ మేరకు పథకాల ప్రయోజనాలను ఆయా వర్గాలకు అందిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగే సంబరాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు.
కాగా ఉమ్మడి ఏపీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలాగిన వందలాది కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయుడు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుపడింది. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైసీపీ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర కోసం జగన్ కృషి చేశారు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోవడంతో ఏపీ రాజకీయాలకే జగన్ పరిమితం అయ్యారు.
అనంతరం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్రను జగన్ చేపట్టారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి మీ గడప వద్దకే మంచి పాలన తీసుకువస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో కాళ్ళ బొబ్బలు, టీడీపీ వెటకారపు మాటలు, విశాఖలో కత్తి పోట్లు, అధికార పార్టీతో గట్టి పోటీ, అక్రమ ఆస్తుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ ధృడ సంకల్పంతో జగన్ ముందుకుసాగారు. వైసీపీ అధినేతగా 8 ఏళ్ల ప్రయాణం, ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు రాజీలేని పోరాటం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు.