తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
రామచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో యూరియా కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు నిందలు మోపుతోందని విమర్శించారు. “కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా కంటే ఎక్కువగా ఇచ్చినప్పటికీ, రైతులకు ఎందుకు చేరడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియాను సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైంది,” అని ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సవాల్ విసిరారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండగా, తెలంగాణలో మాత్రమే కొరత ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Also Read:Bomb Threats: తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
“రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జిమ్మిక్కులతో బిజెపిని టార్గెట్ చేస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్, బిజెపిపై నిందలు వేస్తూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది,” అని ఆయన విమర్శించారు. రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని రామచందర్ రావు స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే, ప్రజలు మోసపోతారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు,” అని ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.