Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చిన కొద్దిసేపటికే, నీలంకరైలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు. అయితే, విఘ్నేష్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, ఈరోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందే సీఎం స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టాం అని చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Black Mailing : హీరోయిన్ పై పీఆర్ టీమ్ నెగిటివ్ క్యాంపైన్..
ఇక, ఈ సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను సీఎం స్టాలిన్ నివాసానికి తరలించి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతర విచారణలో ఇది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. అయినా ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతలో, నీలంకరైలోని టీవీకే అధినేత విజయ్ ఇంటికి కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఆయన ఇంటిని పూర్తిగా గాలించారు. అయితే, అక్కడ ఏవిధమైన పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ కాల్ కూడా నకిలీదే అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఫేక్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.