నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులతోపాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ స్వామివారిని దర్శించుకోనున్నారు.
ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, శాత్తుమోరై, వేదవిన్నపాలు, ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం, మూలమంత్రమూర్తి, మంత్ర హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము, మహా పూర్ణాహుతి, యాగశాల ఉద్వాసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 7.56గంటలకు హస్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున మహాకుంభ ప్రోక్షణను నిర్వహించారు.
ప్రథమారాదనం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోరై, శాంతి కల్యాణం, మహదాశీర్వచనం, పండిత సన్మానం, ఉత్సవ సమాప్తి, స్వస్తితో ప్రతిష్ఠాపన వేడుకలు ముగుస్తాయి.. చివరి రోజున జరిగే అత్యంత ముఖ్యమైన ఈ ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు తెలిపారు.