Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక శాలువాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంపుతానని అతడు ప్రకటించాడు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లకు ఈ శాలువా అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.
Read Also: YS Jagan Nellore Tour: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. వైసీపీ నేతలపై మరో కేసు నమోదు..
అయితే, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం మొత్తం ఖండించిందని చేనేత కళాకారుడు నల్ల విజయ్ తెలిపారు. భారత సైన్యం తన సత్తా చాటిందని గర్వంగా తెలిపారు. తాను నేసిన ఈ బంగారు శాలువా భారత సైనికుల వీరత్వానికి, దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇక, 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన శాలువాను అగ్గిపెట్టెలో సరిపోయేలా నేశాడు.. ఈ శాలువా రెండు మీటర్ల పొడవు, 38 అంగుళాల వెడల్పును కలిగి ఉంది.. దీనిపై ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ప్రతీకాత్మక నివాళి అని రాసుకొచ్చాడు. తన చేతి పనుల నైపుణ్యాన్ని మరోసారి నల్ల విజయ్ కుమార్ ఈ శాలువాపై ప్రదర్శించారు.